|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 09:23 PM
సోషల్ మీడియా వినియోగం పెరగడం వల్ల మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. వ్యాపారస్తులకు మాత్రం బాగా కలసి వచ్చింది. ఆఫర్లు, కొత్త స్టాక్ గురించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. సోషల్ మీడియా వల్ల వ్యాపారస్తులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం లభిస్తుంది అన్నది వాస్తవం. ఒక్క పోస్ట్ చేస్తే చాలు.. ఎక్కడెక్కడో ఉన్న వారు ఆర్డర్స్ పెడుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆఫర్లు.. షాపు యజమానులకు తలనొప్పి తెచ్చి పెడుతుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐదు రూపాయలకే షర్ట్ అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూసి జనాలు షాప్ వద్దకు క్యూ కట్టారు. తర్వాత ఏం జరిగిందంటే..
ఈ సంఘటన నారాయణపేట జిల్లాలోని కొడంగల్ పట్టణంలో వెలుగు చూసింది. ఇక్కడ బస్టాండ్ వద్ద ఓ బట్టల షాపు యజమాని.. తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి సోషల్ మీడియాను వినియోగించేవాడు. ఇన్‌స్టా వేదికగా తన షాపులో వచ్చే కొత్త స్టాక్, ఆఫర్ల గురించి పోస్టులు పెట్టేవాడు. ఈ క్రమంలో తాజాగా బట్టల షాపు యజమాని తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు బంపరాఫర్ ప్రకటించాడు. ఐదు రూపాయలకే షర్ట్ అంటూ ప్రకటించాడు.
ఇంకేముందు అసలే దసరా పండుగ రాబోతుంది. కొత్త బట్టలు కొనాలి.. వేల రూపాయలు ఖర్చు చేసే బదులు ఐదు రూపాయలు పెడితే చొక్కా వస్తుంది కదా అని భావించిన జనాలు.. ఎగబడ్డారు. దీంతో షాప్ వద్ద భారీ క్యూ ఏర్పడింది. తెల్లవారుజాము నుంచే యువకులు షాపు వద్దకు చేరుకుని.. క్యూలో నిలబడ్డారు. షాప్ తెరవడానికి వచ్చిన యజమాని.. ఆ క్యూ లైన్ చూసి ఆశ్చర్యపోయాడు. వారిని దాటుకుని వెళ్లి షాపు తెరవడం పెద్ద తలనొప్పిగా మారింది. కానీ ఏం చేస్తాడు.. ఆఫర్ అని ప్రకటించడంతో.. చివరకు షాపు తెరిచి.. చెప్పినట్లుగానే రూ.5కే షర్ట్ అందించాడు.
పండగపూట ఇంత తక్కువ ధరకే షర్ట్ లభించడంతో కస్టమర్లు చాలా సంతోషంగా ఫీలవుతున్నారు. షాపు యజమానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక ఆఫర్ గురించి తెలిసి.. దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా షాపు వద్దకు చేరుకున్నారు. కానీ వారికి అవకాశం దక్కలేదు. గతంలో కూడా పలు ప్రాంతాల్లో ఇలానే తక్కువ ధరకే చీరలు, దుస్తులు అంటూ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.