|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:54 PM
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను పునర్‌మూల్యాంకనం చేయాలని, లేదంటే పరీక్షను రద్దు చేయాలని ఈ నెల 9న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సవాల్ చేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ ద్విసభ్య ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చట్టపరంగా, సుప్రీంకోర్టు తీర్పుల పరంగా కూడా తప్పుల తడకగా ఉందని కమిషన్ తన పిటిషన్‌లో పేర్కొంది.తమ నిబంధనల్లో సమాధాన పత్రాల పునర్‌మూల్యాంకనానికి ఎలాంటి ఆస్కారం లేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని విస్మరించి, ఊహల ఆధారంగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారని ఆరోపించింది. ఒకవైపు 8 నెలల్లో పునర్‌మూల్యాంకనం చేయాలని చెబుతూనే, మరోవైపు చేయని పక్షంలో పరీక్ష రద్దు చేయాలనడం పరస్పర విరుద్ధంగా ఉందని కమిషన్ పేర్కొంది. సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం దీన్ని ‘విపరీతమైన (పర్వర్స్) తీర్పు’గా పరిగణించాలని వాదించింది.కొందరు అభ్యర్థులు ఫోర్జరీ చేసిన మార్కుల జాబితాను కోర్టుకు సమర్పించారని, పోలీసుల దర్యాప్తులో కూడా అది రుజువైందని టీజీపీఎస్సీ తెలిపింది. అలాంటి తప్పుడు పత్రాల ఆధారంగా దాఖలైన పిటిషన్‌పై తీర్పు ఇవ్వడం సరికాదని వాదించింది. పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఎలాంటి పక్షపాతం లేదని, ర్యాండమైజేషన్ పద్ధతిలోనే కేటాయింపులు జరిగాయని వివరించింది. కోఠి మహిళా కళాశాలలో మౌలిక వసతుల కారణంగానే మహిళా అభ్యర్థులకు కేటాయించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.సింగిల్ జడ్జి తన పరిధి దాటి మైక్రోస్కోపిక్ విచారణ జరిపారని, నిపుణులు తీసుకోవాల్సిన నిర్ణయాలను తానే తీసుకున్నారని కమిషన్ ఆక్షేపించింది. రహస్యంగా సీల్డ్ కవర్‌లో అందించిన కీలక సమాచారాన్ని తీర్పులో బహిర్గతం చేయడం ద్వారా పరీక్షల నిర్వహణ వ్యవస్థకే ప్రమాదం తెచ్చిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగాలు సాధించడంలో విఫలమైన అభ్యర్థుల వాదనలకే సింగిల్ జడ్జి ప్రాధాన్యం ఇచ్చారని టీజీపీఎస్సీ తన అప్పీల్‌లో పేర్కొంది.