|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 07:34 PM
హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న వారికి రేవంత్ సర్కార్ దసరా కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నగర వాసులు చాలా రోజులుగా ఎదురు చూస్తోన్న రూ.5కే టిఫిన్ అందించే ఇందిరమ్మ క్యాంటీన్లను దసరా పండుగ సందర్భంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ నెలాఖరు లేదా దసరా పండుగ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభిచనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం.. పేదలు, సామాన్యుల ఆకలి తీర్చడం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లు తీసుకువచ్చేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. వీటిల్లో రూ.5కే టిఫిన్ అందించనున్నారు. ఈ క్యాంటీన్లు రోజువారి కూలీలు, నిరుద్యోగులు, విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి. ఈ పథకం ప్రారంభం కోసం నగర వాసులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఆగస్టు 15 నాడే వీటిని ప్రారంభిస్తారని భావించారు. కానీ అప్పుడు సాధ్యం కాలేదు. ఈక్రమంలో దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభించనున్నారు.
ఇప్పటికే నగరంలో ఉన్న జీహెచ్ఎంసీ స్టాళ్లలో మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై వీటిల్లో వారంలో ఆరు రోజులు.. ప్రతి రోజు ఉదయం టిఫిన్లు కూడా అందించనున్నారు. ఇక నగరంలో 139 స్టాల్స్ ఉండగా.. వీటి సంఖ్యను ఇప్పుడు 150కి పెంచారు. ప్రస్తుతం నగరం మొత్తం మీద 60 ప్రాంతాల్లో స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉన్న స్టాల్స్‌తో పోల్చితే.. కొత్తవి మూడింతల వెడల్పుతో చాలా విశాలంగా ఉన్నాయి. వీటి కోసం ప్రభుత్వం రూ.11.43 కోట్లు ఖర్చు చేసింది.
ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటిస్తూనే.. పేదలకు రూ.5కే నాణ్యమైన, రుచికరమైన టిఫిన్ అందిస్తామని అధకారులు తెలిపారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రోజూ 25వేల మందికి టిఫిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల టిఫిన్స్ మెనూ సిద్ధం చేసింది బల్దియా. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలతో పాటుగా మిల్లెట్ టిఫిన్స్ కూడా అందించనున్నారు.
ప్రస్తుతం నగరంలో జీహెచ్ఎంసీ తరఫున నగరవాసులకు మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ సహకారంతో బల్దియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. ఐదు రూపాయల టిఫిన్ కార్యక్రమం బాధ్యతలను కూడా దీనికి అప్పగిస్తూ బల్దియా హరే రామా హరే కృష్ణ మూవ్ మెంట్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందిరమ్మ క్యాంటీన్లు త్వరగా అందుబాటులోకి వస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.