|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 09:35 PM
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలో, అధికార కాంగ్రెస్ పార్టీ తన తరఫున పోటీ చేసే అభ్యర్థుల్లో 42 శాతం సీట్లను బీసీ వర్గాలకు కేటాయించి ఎన్నికల బరిలోకి దిగనుంది.రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం రూపొందించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో, ఎన్నికలను ఆలస్యం చేయడం సముచితం కాదని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో, చట్టపరమైన ఆమోదం కోసం వేచి చూడకుండా పార్టీ స్థాయిలో రిజర్వేషన్లను అమలు చేసి ప్రజాతీర్పు కోరాలని నిర్ణయించింది.ఈ నిర్ణయంతో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో 42 శాతం టికెట్లను బీసీ అభ్యర్థులకే కేటాయించనుంది. బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూనే, ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది.గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పీఏసీ, టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఈ సమవేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించినట్లు సమాచారం.