![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 29, 2025, 01:47 PM
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకునే అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక సంఘంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొత్తగా నిర్మించిన ఇంటికి నంబర్ కేటాయించేందుకు ఓ పౌరుడి నుంచి రూ. 5,000 లంచం స్వీకరిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..సుల్తానాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి తాను కొత్తగా నిర్మించుకున్న ఇంటికి నంబర్ కేటాయించాలని కోరుతూ స్థానిక పురపాలక కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కార్యాలయంలోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అనపర్తి వినోద్ కుమార్, బిల్ కలెక్టర్ నాంపల్లి విజయ్ కుమార్ రూ. 5,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ వ్యక్తి నేరుగా తెలంగాణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. ముందుగా అనుకున్న ప్రకారం, ఫిర్యాదుదారుడు శుక్రవారం నాడు కార్యాలయంలో వినోద్ కుమార్, విజయ్ కుమార్‌లకు రూ. 5,000 ఇస్తుండగా.. అక్కడే మాటువేసిన ఏసీబీ బృందం వారిని అదుపులోకి తీసుకుంది. లంచం డబ్బును స్వాధీనం చేసుకుని, ఇద్దరు ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.