|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 06:03 PM
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, స్థానికులు, భక్తుల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన నొక్కిచెప్పారు.జూలై 13, 14 తేదీలలో జరగనున్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఉదయం దేవాలయ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆయా శాఖలు చేపడుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, వారికి ఆతిథ్యం ఇవ్వడంలో నగర ప్రజలు ఎప్పుడూ ముందుంటారని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి కోరారు.