|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 07:49 PM
రామచంద్రాపురం : మియాపూర్ నుండి పటాన్చెరు వరకు గల ఆటో కార్మికుల కోసం లింగంపల్లి చౌరస్తాలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ కింద శాశ్వత ప్రాతిపదికన ఆటో స్టాండ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారి 65 విస్తరణలో భాగంగా లింగంపల్లి చౌరస్తాలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ మూలంగా స్థానికంగా ఆటో స్టాండ్ లేకపోవడం మూలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆటో డ్రైవర్లు ఇటీవల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తెలిపారు. ఉచిత బస్సు మూలంగా గిరాకీలు తగ్గడంతో పాటు ఆటో స్టాండ్ లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పోలీసులు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఆటో యూనియన్ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి ఆటో స్టాండ్ స్థలం కోసం ఎమ్మెల్యే జీఎంఆర్ బిహెచ్ఇఎల్ చౌరస్తాను పరిశీలించారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లై ఓవర్ కింద మూడు పిల్లర్ల మధ్యన ఆటో స్టాండ్ కోసం స్థలం కేటాయించాలని జాతీయ రహదారుల సంస్థ డి ఈ రామకృష్ణ ఆదేశించారు. సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి వారం రోజుల్లోగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తామని ఆయన కార్మికులకు హామీ ఇచ్చారు. ట్రాఫిక్ ఆంక్షలు, ఉల్లంఘనల పేరుతో ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టకూడదని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ ఆటో డ్రైవర్లకు సముచిత స్థానం కల్పిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవేస్ డి ఈ రామకృష్ణ, రామచంద్రాపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ట్రాఫిక్ సిఐ విద్యాసాగర్ రెడ్డి, రామచంద్రాపురం సిఐ జగన్నాథ్, నగేష్ యాదవ్, ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి, ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.