|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 04:57 PM
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మరియు పిటిషనర్ల తరఫున వాదనలు సోమవారం ముగిశాయి. ఇరు పక్షాల వాదనలను విన్న ఉన్నత న్యాయస్థానం, తన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో, పంచాయతీ ఎన్నికల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసినా ఎన్నికలు సకాలంలో నిర్వహించడం లేదని, వెంటనే ఎన్నికలు జరిపేలా ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాదాపు ఆరు వేర్వేరు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గత కొంతకాలంగా ధర్మాసనం విచారణ జరుపుతోంది.తాజాగా జరిగిన విచారణలో, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు తమకు కేవలం నెల రోజుల గడువు సరిపోతుందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మరోవైపు, ఎన్నికల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయడానికి కనీసం 60 రోజుల సమయం అవసరమని రాష్ట్ర ఎన్నికల సంఘం ధర్మాసనాన్ని కోరింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం తమ తమ వాదనలను సమర్పించాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలను వినిపించారు.