|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 04:41 PM
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ప్రాజెక్టులు, వ్యవసాయ భూముల సర్వే పనులు చేసే తేజేశ్వర్ (33) అనే లైసెన్స్‌డ్ సర్వేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. సరిగ్గా నెల రోజుల క్రితమే వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తేజేశ్వర్‌ను దుండగులు పొలం సర్వే చేయాలనే నెపంతో పిలిచి, అత్యంత కిరాతకంగా హత్య చేయడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే... గద్వాల పట్టణంలోని గంటా వీధికి చెందిన తేజేశ్వర్‌కు జూన్ 17న మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. "ఒక పొలం సర్వే చేయాలి. అర్జెంటుగా రావాలి" అంటూ వారు కోరడంతో పని నిమిత్తం తేజేశ్వర్ బయటకు వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పాటు ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వారి ఆందోళనే నిజమైంది. నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం దొరికింది. ఈ వార్త తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.