|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 08:58 PM
సండే వచ్చిందంటే చాలు కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా తెలంగాణ వాసులకు ఆదివారం నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆర్థిక పరిస్థితిని భట్టి కొందరు మటన్ తెచ్చుకుంటే మరికొందరు చికెన్, చేపలతో సండే విందును కంప్లీట్ చేస్తుంటారు. అయితే మటన్ కేజీ రూ. 1000 వరకు పలుకుతుండగా.. నిన్న మెున్నటి వరకు చికెన్ కూడా రూ. 250 వరకు పలికింది. తాజాగా చికెన్ ధరలు దిగొచ్చాయి. గత కొంతకాలంగా మాంసం ధరలు వినియోగదారులను ఆందోళనకు గురి చేయగా.. తాజాగా తగ్గాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు (జూన్ 22) చికెన్ ధర లు గత వారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కిలోపై రూ. 20 నుంచి రూ. 35 వరకు తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కిలో చికెన్ వారం క్రితం వరకు రూ.230-రూ.250 మధ్య పలికింది. ఇవాళ చాలా ప్రాంతాల్లో రూ. 200 కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. ఏపీలోని విజయవాడ, రాజమండ్రిలోనూ కిలో చికెన్ ధర రూ. 220 పలుకుతోంది. అయితే డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో కిలో రూ. 240 వరకు కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా త్వరలో ఆషాడ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో కోళ్ల ధరలు, తద్వారా చికెన్ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని చికెన్ షాప్ యజమానులు అంచనా వేస్తున్నారు. ఈ మాసంలో చాలా మంది మాంసాహారం తినడానికి దూరంగా ఉండటం వల్ల సాధారణంగా డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి, కానీ ఈసారి కోళ్ల పెంపకం ఖర్చులు, ఇతరత్రా కారణాల వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా ప్రస్తుతానికి చికెన్ కొనుగోలు చేసే వారికి మాత్రం తగ్గిన ధరలు గుడ్‌న్యూసే అని చెప్పొచ్చు. భవిష్యత్తులో ధరల పెరుగుదలకు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, బర్ఢ్ ఫ్లూ భయాలతో గత నాలుగు నెలల క్రితం చికెన్ ధరలు అమాంతం తగ్గాయి. ఇప్పుడిప్పుడే ధరలు సాధారణ స్థితికి వస్తుండటంతో ఫౌల్ట్రీ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.