|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 07:32 PM
తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
సోమవారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపింది.
మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రైతులు, ప్రజలు వాతావరణ మార్పులను గమనించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.