|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 07:46 PM
తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. వారి డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 శాతం డీఏ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అంతేకాక పెంచిన డీఏ ఈ ఏడాది అనగా 2025, జనవరి నుంచే అమలు చేస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 71,417 మంది విద్యుత్ శాఖ సిబ్బంది, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ శాఖలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క.. 18 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా మరో 11మంది ఆర్టిజన్లుగా నియామకాలు పొందారు. రెండు రోజుల క్రితం ఖమ్మంలోని ఎలక్ట్రిక్ అంబులెన్స్ ప్రారంభోత్సవంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ సిబ్బంది సమస్యలను త్వరగా పరిష్కారిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతేకాక భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి విద్యుత్ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ సిబ్బంది కలిసి మెలిసి ఒకే కుటుంబంగా పనిచేస్తూ.. తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని సూచించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ సిబ్బందికి రూ.కోటి ప్రమాద బీమా పరిహారం కల్పించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల డీఏపై ప్రకటన చేసింది. వారికి రెండు డీఏలు చెల్లిస్తామని.. ఒకదాన్ని తక్షణమే విడుదల చేస్తామని..మరోదాన్ని 6 నెలల తర్వాత విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలానే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 3.64 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏ రెండేళ్ల క్రితం నుంచి అనగా.. 2023 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని.. ఈ సందర్భంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇకపోతే తెలంగాణ కేబినెట్ ఇటీవలే రెండు డీఏలు ప్రకటించి.. ఒకదాన్ని అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు ప్రకటించిన ఒక డీఏ చెల్లించేందుకు ప్రతి నెలా సగటున సుమారు రూ.200 కోట్లు.. ఏడాదికి దాదాపు రూ.2,400 కోట్ల అదనపు భారం ప్రభుత్వ ఖజానాపై పడనుంది అని ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేశాయి.