|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 07:30 PM
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మరోసారి నిరూపించుకుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో జీవనం సాగిస్తూ.. డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న అనేకమంది బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు విప్లవాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగా.. కొత్తగా 4,021 మంది డయాలసిస్ బాధితులకు ప్రతినెలా రూ.2,016 చొప్పున పెన్షన్ మంజూరు చేసింది. గత పాలనలో 4011 మంది డయాలసిస్ పేషెంట్లు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగింది. డయాలసిస్ చికిత్స అనేది మూత్రపిండాలు పనిచేయని వారికి తప్పనిసరి.
ఈ చికిత్స రోగులకు కేవలం శారీరక క్షీణతనే కాదు.. మానసిక ఒత్తిడి, ఆర్థిక భారాన్ని మోపుతుంది. వారం వారం ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వల్ల ఈ బాధితులు సాధారణ పనులు చేయలేకపోతారు. దీంతో వారి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరిగి.. నిత్యజీవనం దుర్భరంగా మారుతుంది. ఈ క్లిష్ట పరిస్థితులను గుర్తించిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం.. వారి కష్టాలను తొలగించి.. కొంతమేర ఆర్థిక ఉపశమనాన్ని కల్పిస్తోంది. దీనివల్ల వారు పోషకాహారం, రవాణా ఖర్చులు, ఇతర అవసరాలకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తయింది. ప్రజా పాలన నినాదానికి అనుగుణంగా.. అత్యంత అవసరమైన వారికి చేదోడు వాదోడుగా నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని వేగవంతం చేసింది. డయాలసిస్ బాధితులతో పాటు.. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి కూడా త్వరలో పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే సుమారు 13,000 మంది హెచ్‌ఐవీ బాధితులు ఈ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కూడా సాధ్యమైనంత త్వరగా ఆసరా అందించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను విస్తరించేందుకు, నూతన పెన్షనర్లను గుర్తించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమతుల కోసం వేచి చూస్తోంది. ఈ అనుమతులు రాగానే.. మరింత మంది అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కోసం ప్రతినెలా రూ.993 కోట్లు ఖర్చు చేస్తోంది. నూతన లబ్ధిదారుల చేరికతో ఈ వ్యయం మరింత పెరుగుతుంది. ఈ అదనపు ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రజల శ్రేయస్సు పట్ల దాని నిబద్ధతను తెలియజేస్తుంది.