|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 05:34 PM
తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోమారు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కేబీఆర్ పార్క్ పేరును తక్షణమే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కేబీఆర్ పార్క్ వద్ద కొందరు బీసీ నాయకులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, ప్రస్తుతమున్న కాసు బ్రహ్మానందరెడ్డి పేరును తొలగించి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "కేబీఆర్ పార్క్ పేరును వెంటనే తొలగించి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలి. ఒకవేళ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టకపోతే, ఆ పని మేమే పూర్తి చేస్తాం" అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కేబీఆర్ పార్క్ ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.భవిష్యత్తులో బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని జేసీబీల సాయంతో పెకలించివేసి, ఆ స్థానంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.కేవలం కేబీఆర్ పార్క్ మాత్రమే కాకుండా, హైదరాబాద్ నగరంలోని అన్ని పార్కులకు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారి పేర్లను పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతోపాటు, నగరంలోని ఆసుపత్రులు, హోటళ్లు, వివిధ ప్రాంతాల పేర్లను కూడా తెలంగాణ మహనీయుల పేర్లతో మార్చాలని తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.