|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 05:14 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని బూర్గంపాడు మండలంలో గిరిజన మహిళపై జరిగిన దాడి అత్యంత అమానుషమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ దురదృష్టకర సంఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనా విధానానికి, పరిపాలన తీరుకు అద్దం పడుతోందని ఆయన విమర్శించారు.ఈ ఘటనపై స్పందించిన కేటీఆర్, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టబద్ధమైన పాలన ఎలా అమలవుతుంది" అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళల భద్రత, గిరిజనుల హక్కుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పైనా కేటీఆర్ విమర్శలు సంధించారు. "రాహుల్ గాంధీ దేశ ప్రజలకు ఇస్తున్న హామీ ఇదేనా ప్రియాంక గాంధీ దేశంలోని మహిళలకు ఇలాంటి గౌరవాన్నే కోరుకుంటున్నారా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రస్తావించే సమానత్వం అంటే ఇదేనా" అంటూ ఆయన వరుస ప్రశ్నలు వేశారు. బూర్గంపాడు ఘటన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.