|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 11:33 AM
ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించి చరిత్ర సృష్టిస్తున్నారు. తాజాగా సరిత అనే మహిళ.. తెలంగాణ ఆర్టీసీ (TGSRTC)లో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా రికార్డు సృష్టించారు. మహిళలందరికి ఆమె ప్రస్తుతం ఆదర్శంగా నిలుస్తుంది. ఇన్నిరోజులు దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించిన సరిత ప్రత్యేక అనుమతితో తెలంగాణ ఆర్టీసీలో చేరారు. పురుషాధిక్య రంగంగా భావించే రవాణా రంగంలో సరిత లాంటి మహిళలు అడుగుపెట్టి సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడం స్త్రీ సాధికారతకు నిలువెత్తు నిదర్శనం.
ఎవరీ సరిత..?
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన వాంకుడోతు సరిత జీవితం ఎన్నో కష్టాలు, సవాళ్లతో కూడుకున్నది. వాంకుడోతు రాంకోటి, రుక్కా దంపతులకు ఆరుగురు సంతానంలో ఐదో అమ్మాయి సరిత. నలుగురు అక్కల పెళ్లి కోసం తన తండ్రి ఉన్న మూడెకరాల భూమిని అమ్మివేయడంతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో పదో తరగతి మధ్యలోనే చదువు ఆపేసి తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచింది. వేసవి సెలవుల్లో దేవరకొండలోని అక్క ఇంటికి వెళ్లిన సరిత తన బావ వద్ద ఆటో నడపడం నేర్చుకుంది. దురదృష్టవశాత్తు కొన్నాళ్లకే బావ అనారోగ్యంతో మరణించడంతో తల్లిదండ్రులు, తమ్ముడితో పాటు అక్క బాధ్యతను కూడా సరిత తన భుజాలపై వేసుకుంది. దేవరకొండ ప్రాంతంలో ఆటో నడపడం మొదలుపెట్టింది.