|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:26 PM
పటాన్చెరు : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి యోగా ప్రాముఖ్యత తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో నేడు పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో యోగ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం మైత్రి మైదానంలో యోగా డే వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా పరిపూర్ణ ఆరోగ్యంతో.. విశ్వశాంతితో ముందుకు సాగాలన్నదే యోగ దినోత్సవ ఉద్దేశమని తెలిపారు. విశ్వవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు యోగ విశిష్టతను తెలుసుకొని ప్రతిరోజు యోగ సాధన చేస్తున్నారని తెలిపారు. యోగ మార్గం ఆవిష్కృతమైన భారతదేశంలో ప్రజలందరూ యోగ సాధన చేసి పరిపూర్ణమైన ఆరోగ్యం పొందాలని కోరారు. యోగ వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహర్షి పతాంజలి సంస్థ శిక్షకుల ఆధ్వర్యంలో యోగ విన్యాసాలు చేయడం జరుగుతుందని తెలిపారు.
శనివారం ఉదయం ఏడు గంటల నుండి. 9 గంటల వరకు యోగా వేడుకలు జరుగుతాయని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, అనధికారులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, కార్మికులు మహిళలు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని కోరారు.