|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 05:04 PM
తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి జోరుగా ప్రచారం సాగుతుంది. త్వరలోనే వీటిని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇక వీటితో పాటు తెలంగాణలో మరో ఉప ఎన్నిక కూడా నిర్వహించాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆరు నెలల్లోపు దీనికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పట్లో జూబ్లీహిల్స్ ఎన్నిక ఉండదని ప్రకటించిన సంగతి తెలిసిందే.
కానీ అధికార పార్టీ సహా.. ఇతర పార్టీ నేతలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గురి పెట్టారు. ఆయా పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసేది తామే అని ఎవరికి వారు ప్రకటించుకుంటున్నారు. ఇలా ఉండగా.. తాజాగా ఈ జాబితాలోకి అజారుద్దీన్ కూడా చేరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోయేది తానే అని ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు.
ఈక్రమంలో గురువారం నాడు అజారుద్దీన్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో ముచ్చటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేది తానే అని స్పష్టం చేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో .. తనకు చివరి క్షణంలో టికెట్ కేటాయించారని గుర్తు చేసుకున్నారు. అయినా సరే.. తాను తీవ్రంగా కృషి చేసి.. చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయానని తెలిపారు. అలానే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో.. కాంగ్రెస్ పార్టకీ ఎక్కువ ఓట్లు వచ్చింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే అని తెలిపారు.
ఈ సందర్బంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను అని తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్లీ చాలా బలంగా ఉందని.. రానున్న ఉప ఎన్నికలో పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని.. తప్పకుండా విజయం సాధిస్తానని అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోవడంతో.. ఆ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి గెజిట్ ద్వారా నోటిఫై చేశారని.. దీని గురించి తమకు సమాచారం ఉందని.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి తమకు పంపించిన గెజిట్‌ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిచామని ఆయన తెలిపారు. ఉపఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అంతేకాక దేశంలోఎక్కడైనా ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఆరు నెలల సమయం ఉంటుందన్నారు. 2025 చివరి నవంబర్ వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది.