|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 04:43 PM
తెలంగాణలో బోనాల పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ విశిష్ట వేడుకకు మళ్లీ సమయం ఆసన్నమైంది. జూన్ 26 నుంచి జూలై 26 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా జరగనుంది. అమ్మవారిని పుట్టింటికి ఆహ్వానించి, ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆ తర్వాత సారెతో అలంకరించి అత్తింటికి పంపించడమే ఈ పండుగ ప్రత్యేకత. హైదరాబాదుతో పాటు ప్రాంతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది ఈ బోనాల మహోత్సవం. గోల్కొండలో ఘన ప్రారంభం.. ప్రతి ఏడాది ఆషాఢ మాసం తొలి ఆదివారం లేదా గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా ఆలయంలో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. ఎప్పుడెప్పుడంటే.. ? జూన్ 26న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 29న విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పించనున్నారు. జూలై 13న సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరుగనుంది. జూలై 14న అమ్మవారి రంగా మహోత్సవం - భవిష్యవాణి కార్యక్రమం జూలై 20న లాల్‌దర్వాజ మహంకాళమ్మ దేవాలయంలో బోనాల మహోత్సవం జూలై 21న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు జూలై 24న బోనాల ఉత్సవాలు ముగింపు కార్యక్రమాలతో పూర్తవుతుంది. బోనాలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వేలాది భక్తులు జాతరను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తరలి వస్తారు. మహిళలు ప్రత్యేకంగా బోనం (అమ్మవారికి సమర్పించే ప్రత్యేక నైవేద్యం)ను మట్టి పాత్రలో తయారుచేసి, పసుపు, కుంకుమతో అలంకరించి తలపై మోసుకుంటూ ఆలయాలకు వెళ్లడం కన్నుల పండువగా ఉంటుంది. పల్లకీలు, డప్పులు, కోలాటాలు, డోలలు, దండీయాలతో కూడిన ఊరేగింపులు నగరవ్యాప్తంగా సందడి చేస్తాయి. జాతర నేపధ్యంలో నగరంలోని ముఖ్యమైన ఆలయాలు, ప్రధాన వీధుల్లో భారీగా భక్తుల రద్దీ ఏర్పడనుంది. దీంతో పోలీసు శాఖ, GHMC, R&B, మున్సిపల్ శాఖలు, బస్సు సేవలు, ఎమర్జెన్సీ సిబ్బంది ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నీటి సరఫరా, మెడికల్ సౌకర్యాలు మొదలైనవి అమలు చేయనున్నారు.