|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 12:34 PM
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. 3జీ 329 థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. టేకాఫ్ అయ్యే సమయంలో సమస్య తలెత్తడంతో బ్యాంకాక్‌లోనే విమానాన్ని నిలిపివేశారు. విమానం నుంచి ప్రయాణికులను దింపివేశారు. ప్రస్తుతం ప్రయాణికులు బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు. టెక్నికల్ ఎర్రర్ ఉండటం వల్లే విమానం ఆలస్యంగా బయలుదేరుతుందని ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత బ్యాంకాక్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు విమానం చేరుకునే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా విమానాలు నిలిచిపోవడం లేదా.. ఎమర్జెన్సీగా ఇతర విమానాశ్రయాలకు తరలించడం వంటివి జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ రావాల్సిన విమానాల్లో ఈ వారంలోనే నాలుగు విమానాల్లో సాంకేతిక సమస్య వల్ల నిలిచిపోయాయి. అలాగే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాల్లో ఈ మధ్య కాలంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. నిన్న హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల నిలిచిపోయింది. టేకాఫ్ అయిన 10 నిమిషాలకే సమస్య రావడంతో తిరిగి విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉండగా.. వారందరినీ ఇతర విమానాల్లో తిరుపతికి పంపారు ఎయిర్‌పోర్టు సిబ్బంది. కాగా.. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. దీంతో విమానాలను రద్దు చేయడం లేదా అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నారు. కేవలం 48 గంటల్లోనే తొమ్మిది ఎయిరిండియా విమానాల్తో సాంకేతిక సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది.