|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:59 PM
బెల్లంపల్లి పట్టణానికి చెందిన విద్యార్థి రియాన్ స్కూల్ ఆటోలో ప్రయాణించుతూ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై గురువారం ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, స్థానిక ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అందరూ మౌనంగా నివాళి అర్పిస్తూ విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్ మాట్లాడుతూ, స్కూల్ ఆటోలు నడిపే డ్రైవర్లు ఓవర్ లోడ్ కు పాల్పడకుండా, అన్ని ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పిల్లల ప్రాణాలతో ఆడుకునే తీరును సమాజం సహించదని హెచ్చరించారు. డ్రైవర్లు శ్రద్ధగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
అలాగే, బెల్లంపల్లి సుభాష్ నగర్ ప్రాంతంలో పందుల బెడదపై కూడా ఆయన మాట్లాడారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావును కోరారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.