|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 02:59 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 37 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు తరగతులను ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బొల్లారం మున్సిపల్ పరిధిలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలలో అదనపు తరగతులు నిర్మించడంతోపాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. 25 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ప్రతి తరగతికి పెయింటింగ్, ఫ్లోరింగ్ తో పాటు రంగురంగుల బొమ్మలు, వివిధ శాస్త్రవేత్తల చిత్రాలు వేయించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాల ఆవరణలో గల క్రీడా ప్రాంగణాన్ని సైతం ఆధునికరిస్తున్నామని తెలిపారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, కోకో, కబడ్డీ కోర్టులను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో 975 మంది, ప్రాథమిక పాఠశాలలో 250 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పాఠశాలను మరింత అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో అరుణ, మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి, అనిల్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.