|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 02:54 PM
తమ ప్రేమను పెద్దలు కాదంటరన్న అనుమానంతో ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రిభువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం జిల్లా జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం నెమలికొండకు చెందిన మచ్చ శృతి(23), కె. వినయ్ కుమార్(25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు ఇష్టపడటంతో కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ మధ్యే వారి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. అయితే తమ ప్రేమను కాదంటారని, తమ వివాహానికి పెద్దలు అంగీకరించరని వారిద్దరూ అనుమానించారు. దీంతో ఆదివారం అర్థరాత్రి ఇంటినుంచి బయలు దేరి బయటకు వచ్చారు. తమ ప్రేమను కాదంటే విడిపోయి బతకలేమని నిర్ణయించుకున్న వారిద్దరూ భువనగిరి శివారులో రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం వారి శవాలను గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా పంచనామా నిమిత్తం మృతదేహాలను జనరల్ ఆసుపత్రికి తరలించారు.