|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 02:38 PM
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం చోటుచేసుకున్న అకాల వర్షం తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షానికి పాటు పిడుగులు పడటంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించాయి.
ఇల్లెందు మండలంలోని కట్టుగూడెం గ్రామంలో పి. పుల్లయ్య (45) అనే రైతు తన పొలాల్లో పని చేస్తున్న సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న అతని సోదరుడు వెంకన్న పిడుగుబారిన పడి తీవ్రంగా సొమ్మసిల్లిపోయాడు.
ఇక కారేపల్లి మండలంలోని పాటిమీదిగుంపు వద్ద పిడుగుపాటుకు 20 మూగజీవాలు (పశువులు) మృత్యువాతపడ్డాయి. ఇదే ప్రాంతంలో లక్ష్మయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
అదే సమయంలో చుంచుపల్లి, ములకలపల్లి మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి నష్టానికి గురైంది. ప్రభుత్వం తరఫున సహాయక చర్యలు, నష్టపరిహార చర్యలు చేపట్టాలన్న డిమాండు కొనసాగుతోంది.