|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 03:04 PM
సినీ నటి ప్రణీత సుభాష్ వీఐపీ సంస్కృతిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఓ రాజకీయ నాయకుడి పర్యటన కోసం ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేయడంపై ఆమె సోషల్ మీడియా వేదికగా అసహనం ప్రదర్శించారు. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి చర్యల వల్లే దేశం ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.బెంగళూరులోని సిటీ సెంటర్, కోరమంగళకు వెళ్లే మార్గాలను ఓ వీఐపీ కాన్వాయ్ కోసం మూసివేయడంతో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ పరిణామంపై స్పందించిన ప్రణీత, "ఇది చాలా చికాకుగా ఉంది. ఓ రాజకీయ నాయకుడి వీఐపీ పర్యటన కోసం రోడ్లను మూసివేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితంగా ఇలాంటి వాటి వల్లే మన దేశం ఎప్పటికీ ముందుకు వెళ్లదు" అని పేర్కొన్నారు."రాజకీయ నాయకులు, వారి వీఐపీ జీవితాలు దేశ ప్రగతికి ఏమాత్రం సాయపడకపోగా, మరిన్ని సమస్యలను మాత్రమే సృష్టిస్తున్నాయి" అంటూ ఆమె తన పోస్టులో ఘాటుగా విమర్శించారు. ప్రణీత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News