|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:16 PM
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ అభిమానులకు ఇది శుభవార్త. ఆయన నటించిన ప్రయోగాత్మక ఏలియన్ కామెడీ చిత్రం ‘అయలాన్’ తెలుగులో ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. ఇప్పటివరకు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ విడుదల కాకపోవడంతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది నిజంగా శుభవార్తే.శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అయలాన్’ చిత్రం 2024 సంక్రాంతికి తమిళంలో విడుదలైంది. అప్పట్లోనే తెలుగు వెర్షన్‌ను కూడా థియేటర్లలో విడుదల చేయాలని యోచించారు. జనవరి 26న తెలుగు విడుదల ఉంటుందని ప్రకటించడంతో పాటు, హైదరాబాద్‌లో శివకార్తికేయన్ ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. కానీ అనివార్య కారణాల వల్ల బిగ్ స్క్రీన్ విడుదల నిలిచిపోయింది. అనంతరం తమిళ వెర్షన్‌ను సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు. అయితే తెలుగు డబ్బింగ్‌పై అప్పట్లో ఎలాంటి సమాచారం వెలువడలేదు.ఈ నేపథ్యంలో గత నెల డిసెంబరులో తెలుగు వెర్షన్‌ను జీ తెలుగులో ప్రసారం చేయడం ద్వారా తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తాజాగా ఓటీటీ విషయంలోనూ స్పష్టత వచ్చింది. అయలాన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జనవరి 7 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News