|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 10:24 PM
పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినీ పరిశ్రమలో కేవలం ఒక హీరో మాత్రమే కాదు… ఆ పేరే ఓ ప్రభంజనం. ఆయన నటనలో కనిపించే ఎనర్జీ, స్టైల్‌లోని ప్రత్యేకమైన మేనరిజమ్స్‌కు అసంఖ్యాకమైన అభిమానులు ఉన్నారు.అదే విధంగా, మార్షల్ ఆర్ట్స్‌లో ఆయనకు ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలం విరామం తర్వాత, జనవరి 7, 2026న పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ సోషల్ మీడియా అకౌంట్‌లో ప్రత్యక్షమైన ఒక వీడియో అభిమానులను విపరీతంగా ఆశ్చర్యపరిచింది.ఈ రోజు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు, జపాన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎర్రటి సూర్యుడు, దానికి రెండు వైపులా జపాన్ లిపిలో ఉన్న అక్షరాలు కనిపిస్తాయి. చివర్లో కటానా కత్తిని ఒరలో పెట్టే దృశ్యం, అలాగే “PK” అక్షరాలు ఉన్న టీషర్ట్ ధరించిన వ్యక్తి (అది పవన్ కళ్యాణ్ కావచ్చనే సంకేతాలు) ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది కేవలం ఒక సినిమా అనౌన్స్‌మెంట్ మాత్రమే కాకుండా, యుద్ధ విద్యల పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న మక్కువను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా కనిపిస్తోంది. వీడియో చివర్లో ఆయన కెరీర్ ఆరంభంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న రోజుల ఫోటోను చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పవన్ కళ్యాణ్ తన సినీ ప్రయాణం మొదలైనప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలో కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘జానీ’ వంటి చిత్రాల్లో ఆయన ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు అప్పట్లో యువతలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించాయి. కేవలం నేర్చుకోవడమే కాకుండా, తన సినిమాల కోసం నిరంతరం సాధన చేయడం ఆయన ప్రత్యేకత. అప్పటి వరకు తెలుగు తెరపై చూడని సరికొత్త ఫైట్ కంపోజిషన్లను స్వయంగా డిజైన్ చేసుకునేవారు.ఇప్పుడు విడుదలైన ఈ వీడియో అసలు దేనికి సంబంధించినదనే విషయం ఆసక్తికరంగా మారింది. గతంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకునే యువత కోసం పవన్ కళ్యాణ్ ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. బహుశా ఆ దిశగానే అడుగులు పడుతున్నాయేమో చూడాలి. లేకపోతే, ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంపై ఆధారపడి ఒక స్ఫూర్తిదాయకమైన సిరీస్ వచ్చే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. మరి ఈ వీడియో వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో వేచి చూడాల్సిందే.
Latest News