|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 09:12 PM
పాన్ ఇండియా హీరోగా బాక్సాఫీస్‌ను ఏలుతున్న ప్రభాస్ మరోసారి తన సత్తాను నిరూపించాడు. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకుపోతున్న ది రాజా సాబ్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రారాజుగా నిలిచాడు ప్రభాస్.హారర్ ఫాంటసీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఓపెనింగ్ పరంగా ప్రభాస్ మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
*రాజా సాబ్ కలెక్షన్లు :ప్రభాస్ తాజా చిత్రం రాజా సాబ్ థియేటర్లలో హంగామా సృష్టిస్తోంది. మిక్స్‌డ్ టాక్ ఉన్నా వసూళ్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈ సినిమా రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
*ప్రభాస్ రికార్డు : రాజా సాబ్ కలెక్షన్లతో ప్రభాస్ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. ఇండియన్ సినీ పరిశ్రమలో ఇప్పటివరకు మరే హీరోకు సాధ్యం కాని రికార్డును ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. రూ.100 కోట్లకు పైగా ఓపెనింగ్ వసూళ్లు సాధించిన సినిమాలు ప్రభాస్ కెరీర్‌లో మొత్తం ఆరు కావడం విశేషం.
*రూ.100 కోట్ల ఓపెనింగ్ సినిమాలు : బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు రాజా సాబ్తో కలిసి ఫస్ట్ డేనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆరు సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.ఫస్ట్ డే రూ.100 కోట్ల ఓపెనింగ్ సాధించిన ప్రభాస్ సినిమాలు ఇవే:బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజా సాబ్.
*సెంచరీ వసూళ్లు :బాహుబలి మొదటి భాగం విజయం, అలాగే “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?” అనే ఉత్కంఠ కారణంగా బాహుబలి 2కు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ దక్కాయి. ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.212 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.సాహో రూ.130 కోట్ల ఓపెనింగ్ అందుకోగా, విమర్శల పరంగా నిరాశపరిచిన ఆదిపురుష్ కూడా వసూళ్లలో మాత్రం అదరగొట్టింది. ఈ చిత్రం తొలి రోజే రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.సలార్ తొలి రోజు రూ.178 కోట్లను సొంతం చేసుకోగా, కల్కి రూ.191 కోట్ల గ్రాస్ వసూళ్లతో ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చాటింది.