|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 04:02 PM
చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'మన శంకర వరప్రసాద్ గారు'. ఇంతవరకూ వరుస హిట్స్ ఇస్తూ వచ్చిన అనిల్ రావిపూడి నుంచి ఈ సినిమా రూపొందడం .. వెంకటేశ్ గెస్ట్ రోల్ చేయడం .. చిరంజీవి - నయనతార రొమాన్స్ ను టచ్ చేస్తూ సాగే 'మీసాల పిల్ల' సాంగ్ పాప్యులర్ కావడం ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో సందడి చేసిందనేది చూద్దాం.
కథ: శంకర వరప్రసాద్ (చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య శశిరేఖ (నయనతార) పెద్ద బిజినెస్ విమెన్. తండ్రి జీవీఆర్ (సచిన్ ఖేడ్కర్)కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను ఆమె చక్కబెడుతూ ఉంటుంది. ప్రసాద్ - శశిరేఖకి విడాకులు జరిగిపోయి 10 ఏళ్లు అవుతుంటుంది. పిల్లలను కూడా తన కంటపడకుండా చేయడం పట్ల ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. తండ్రి పట్ల పిల్లలకి సదాభిప్రాయం లేకుండా చేసిందని తెలుసుకుంటాడు. ప్రసాద్ తన పిల్లలు నిక్కీ .. విక్కీ చదువుకునే స్కూల్ కి 'పీటీ' సార్ గా వెళతాడు. వాళ్లకి దగ్గర కావాలనేదే అతని ప్రధానమైన ఉద్దేశం. చాలా తక్కువ సమయంలోనే వాళ్లకి చేరువైన ప్రసాద్, అలాంటి తండ్రి తమకి ఉంటే బాగుంటుందని అనిపించగలుగుతాడు. పిల్లల కోసమైనా శశిరేఖకి మళ్లీ దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. పీటీ సార్ గా తన ప్లాన్ కి శశిరేఖ తెరదించడంతో, జీవీఆర్ కి సెక్యూరిటీ ఆఫీసర్ గా ప్రసాద్ తన టీమ్ తో ఆ ఇంట్లోకి అడుగుపెట్టవలసి వస్తుంది.ఇదే సమయంలో జైలు నుంచి వీరేంద్ర పాండా (సుదేవ్ నాయర్) విడుదలవుతాడు. తాను సస్పెన్షన్ వేటుపడిన పోలీస్ ఆఫీసర్. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన క్రిమినల్. అతను శశిరేఖను .. ఆమె పిల్లలను అంతం చేయడానికి రంగంలోకి దిగుతాడు. ప్రసాద్ - శశిరేఖ ఎందుకు విడిపోతారు? ఆమెకి దగ్గర కావడానికి ప్రసాద్ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? శశిరేఖపై వీరేంద్ర పాండా పగబట్టడానికి కారణం ఏమిటి? అతని బారి నుంచి తన ఫ్యామిలీని ప్రసాద్ ఎలా రక్షించుకుంటాడు? ఈ తతంగంలో వెంకీ గౌడ (వెంకటేశ్) పాత్ర ప్రయోజనం ఏమిటి? అనేది మిగతా కథ.
Latest News