|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 06:59 PM
తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోరు కీలక దశకు చేరుకుంది. గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారంలో వేగాన్ని గణనీయంగా పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల వ్యూహంలో భాగంగా, నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా సీనియర్ మంత్రులకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. మంత్రులను ముఖ్య ప్రచారకులుగా నియమించి.. అన్ని ప్రాంతాలను ముమ్మరంగా కవర్ చేసేలా నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రచార బృందాలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులకు అప్పగించిన డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతలు ఇలా ఉన్నాయి. షేక్ పేట డివిజన్‌లో ప్రాంతంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి , కొండా సురేఖ ప్రచార బాధ్యతలు స్వీకరించారు. యూసుఫ్ గూడ డివిజన్ ప్రాంతంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
రహమత్ నగర్ డివిజన్ ప్రాంతంలో బాధ్యతను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు అప్పగించారు. ఎర్రగడ్డ డివిజన్‌లో మంత్రులు దామోదర రాజనర్సింహ , జూపల్లి కృష్ణారావు ప్రచారం చేస్తున్నారు. బోరబండ డివిజన్‌లో మంత్రి సీతక్క , ఎంపీ మల్లు రవిలు ఈ డివిజన్‌లో పర్యటిస్తున్నారు. వెంగళ్ రావు నగర్ డివిజన్ బాధ్యతలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి అప్పగించారు. సోమాజిగూడ డివిజన్‌కు.. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ప్రచారం చేయనున్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రులు నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు.. ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థిపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలను కూడా మంత్రులు తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల విజయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు చిహ్నంగా మారుతుందని పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.