|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 04:25 PM
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు అక్టోబరు 20న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. ఆ సమయానికి గేటులోపల ఉన్నవారికే అవకాశం కల్పించారు. ఇప్పటివరకూ మొత్తం 150కిపైగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది. కాగా, తాము క్యూలైన్‌లో నిరీక్షిస్తుంటే.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని నేరుగా లోపలికి అనుమతించడంపై స్వతంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ ఆఫీసు ఎదుట వారు ఆందోళనకు దిగారు. తాము ఉదయం నుంచి లైన్‌లో వేచిచూస్తుంటే అప్పుడే వచ్చిన దీపక్ రెడ్డిని ఎలా అనుమతిస్తారని అధికారులను నిలదీశారు. స్వతంత్రులు, రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నేతలు కూడా చివరి రోజున నామినేషన్లు దాఖలు చేశారు
మరోవైపు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో కలిసి వచ్చిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలుచేశారు. ముందుగా వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ గుడిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావులతో కలిసి దీపక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర అక్కడి నుంచి భారీ ర్యాలీగా షేక్‌పేట ఎమ్మార్వో ఆఫీసుకు చేరుకుని వెళ్లి నామినేషన్ వేశారు. చివరి రోజు కావడంతో స్వతంత్రులు భారీగా నామినేషన్లు వేయడానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 13 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబరు 22 బుధవారం నుంచి ఈ నామినేషన్ల స్క్రూట్నీ జరుగుతుందని, ఆర్మో సాయిరాం వీటిని పరిశీలించనున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే, నామినేషన్ల ఉప-సంహరణకు చివరి తేదీ అక్టోబరు 24 కాగా... నవంబరు 11న పోలింగ్ నిర్వహించి, నవంబరు 14 ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఉప-ఎన్నిక జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఆయన సతీమణి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీచేస్తున్నారు. 2023 తెలంగాణ ఎన్నికల్లో దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, మూడో స్థానంలో నిలిచారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విషయానికి వస్తే ఆయన 2014 ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీచేసి, ఓటమి చవిచూశారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరినా.. అజహారుద్దీన్‌కు అధిష్ఠానం టిక్కెట్ కేటాయించింది.