|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 08:48 PM
రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్షాల అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపింది.
దక్షిణ అండమాన్‌ను ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలను ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి.. మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పింది.
ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. గురువారం రోజున ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అదే సమయంలో శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, ములుగు, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడినట్లు పేర్కొంది. ఇక ప్రస్తుతం రైతులు వరి ధాన్యం కోసి.. వడ్లను ఆరబోస్తుండగా.. ఈ సమయంలో కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల మార్కెట్ యార్డుల్లో పోసిన ధాన్యం వర్షాలకు తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.