|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 05:14 PM
సులభంగా రుణాలు ఇస్తామంటూ ఆశ చూపిస్తున్న ఇన్‌స్టంట్ లోన్ యాప్‌ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. ఇటీవల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎంతోమంది ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, తీవ్రమైన వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలు, ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. తక్కువ వడ్డీకే క్షణాల్లో లోన్ మంజూరు చేస్తామంటూ నమ్మించి, వారి వలలో వేసుకుంటున్నారని వివరించారు. రుణం ఆమోదం కోసం ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో ముందుగానే డబ్బులు వసూలు చేయడం లేదా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం వంటి మోసాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు.అందుకే కనిపించిన ప్రతి లోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, ముఖ్యంగా ఏపీకే ఫైల్స్‌ను అసలు ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దని పోలీసులు గట్టిగా సూచించారు. యాప్‌లకు అనవసరంగా కాంటాక్ట్స్, గ్యాలరీ వంటి పర్మిషన్లు ఇవ్వడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. "చిన్న మొత్తంలో రుణం కోసం మీ విలువైన వ్యక్తిగత డేటాను పణంగా పెట్టవద్దు. రుణం కన్నా మీ డేటా భద్రతే ముఖ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి" అని పోలీసులు విజ్ఞప్తి చేశారు.