|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 05:12 PM
స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేర్లు ఈరోజు దుమ్మురేపాయి. కంపెనీ ఇటీవల ప్రకటించిన బలమైన త్రైమాసిక ఫలితాలతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఎగబడటంతో షేరు ధర భారీగా పెరిగింది. ఈ ఒక్కరోజు ట్రేడింగ్‌లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.66 వేల కోట్ల మేర పెరగడం విశేషం.రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు రోజుల క్రితం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక (జులై-సెప్టెంబర్) ఫలితాలను వెల్లడించింది. ఈ కాలంలో కంపెనీ అంచనాలను మించి రూ.18,165 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం అధికం. అలాగే కంపెనీ ఆదాయం కూడా రూ.2.83 లక్షల కోట్లకు చేరింది. ఈ సానుకూల ఫలితాల ప్రభావం సోమవారం నాటి ట్రేడింగ్‌పై స్పష్టంగా కనిపించింది.గత సెషన్‌లో రూ.1416.80 వద్ద ముగిసిన రిలయన్స్ షేరు, సోమవారం ఉదయం నుంచే లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రా-డేలో దాదాపు 4 శాతం పెరిగి రూ.1466.70 గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ అనూహ్య పెరుగుదలతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.17 లక్షల కోట్ల నుంచి రూ.19.83 లక్షల కోట్లకు ఎగబాకింది. సాధారణంగా ఒకటి, రెండు శాతం పరిధిలోనే కదలాడే రిలయన్స్ షేరు, చాలా కాలం తర్వాత ఒకేరోజు ఈ స్థాయిలో లాభపడటం మార్కెట్ వర్గాలను ఆకర్షించింది.