|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 09:08 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరో కీలక దశను దాటి ముందుకు సాగింది. తాజాగా గ్రూప్-2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా "ప్రజాపాలనలో కొలువుల పండుగ" అనే పేరుతో శిల్పకళావేదికలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని, నియామిత అభ్యర్థులను అభినందించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ లక్ష్యాలను వివరించిన సీఎం, అభ్యర్థులకు భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 100వ సంవత్సరానికి సరికొచ్చేలా, తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో తాజా నియామితుల పాత్ర కీలకమవుతుందని పేర్కొన్నారు.ఉద్యోగానికి నియామక పత్రం అందుకోవడం వ్యక్తి జీవితంలో ఓ మైలురాయిగా అభివర్ణించిన సీఎం, దీపావళి పండుగ సందర్భంగా తల్లిదండ్రులతో పాటు అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సేవ చేయాలని, తల్లిదండ్రుల త్యాగాలను ఎప్పటికీ మరిచిపోవద్దని సూచించారు. పుట్టిన ఊరికి సేవ చేయడమే నిజమైన అభివృద్ధి అని గుర్తు చేశారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. తల్లిదండ్రులను విస్మరించే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి 10 శాతం మొత్తాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేసేలా చట్టం తీసుకురావాలన్న ఉద్దేశం ప్రభుత్వం ముందు పెట్టుకున్నట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని సీఎం గుర్తుచేశారు. అంతేకాక, ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కుల గణనను పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన పేర్కొన్నారు.