|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 08:31 PM
తెలంగాణలోని కొందరు రాజకీయ నాయకులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. మావోయిస్టులతో ఉన్న సంబంధాలను వెంటనే తెంచుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం 'ఎక్స్' వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు."తెలంగాణ రాజకీయ నాయకులు దీనిని ఒక హెచ్చరికగా పరిగణించండి. వేదికలపై ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ, తెరవెనుక సాయుధ గ్రూపులకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వెంటనే తమ సంబంధాలను వదులుకోవాలి. లేదంటే వారిని బట్టబయలు చేస్తాం. కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలు కేవలం మావోయిస్టు కేడర్‌తోనే ఆగిపోవు" అని బండి సంజయ్ తన పోస్ట్‌లో గట్టిగా హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో అవినీతి, నేరాలు, తీవ్రవాద సంబంధాలను కాపాడుతున్న శక్తులను కేంద్రం కనికరం లేకుండా అణిచివేస్తుందని ఆయన తెలిపారు. "సమస్యలో భాగమైన వారు ఎంత పెద్దవారైనా సరే.. పక్కకు తప్పుకోండి. దేశ అంతర్గత భద్రత విషయంలో తప్పు వైపు నిలబడితే ఎంతటి ఉన్నత నాయకులైనా పతనం కాక తప్పదు" అని స్పష్టం చేశారు.