|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 08:26 PM
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, తెలంగాణలో రాబోయే మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం సమీపంలో ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని తెలిపింది.ఈ ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బలమైన వాయుగుండంగా మారే అవకాశముంది.ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల వంటి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.సోమవారం, మంగళవారం తేదీల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే బుధవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.గత 24 గంటల్లో కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని, ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో వర్షాల జోరు ఉందని TGDPMS సమాచారం వెల్లడించింది.