|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 09:09 AM
ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నట్లుగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.కొన్ని వార్తాపత్రికలు, యూట్యూబ్ ఛానళ్లు తాను పార్టీ మారుతున్నట్లుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని, ఈ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఈటల తన పోస్టులో పేర్కొన్నారు. బురద చల్లి కడుక్కోమనటం బట్ట కాల్చి మీద వేయడం మంచి పద్ధతి కాదు. నేను మాటలు మార్చే, పార్టీలు మారే వ్యక్తిని కాదు అని ఆయన స్పష్టం చేశారు.పార్టీ మారడమనేది బట్టలు మార్చుకున్నంత సులభం కాదని, జీవితంలో అది ఒక గొప్ప నిర్ణయంగా ఉండాలని, దానికి బలమైన కారణం కూడా ఉండాలని ఈటల అభిప్రాయపడ్డారు. గతంలో తాను టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి గల కారణాలను కూడా ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ నుంచి కూడా నన్ను బయటికి పంపిస్తేనే వచ్చాను తప్ప, నా అంతట నేను రాలేదు. కష్టకాలంలో నన్ను బీజేపీ అక్కున చేర్చుకుంది అని తెలిపారు.తనపై పదేపదే ఇలాంటి ప్రచారంతో శీలపరీక్ష పెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.