|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 08:36 PM
కల్వకుంట్ల కవిత వ్యవహారం, పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కవిత వ్యవహారం పూర్తిగా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేనని వ్యాఖ్యానించారు. ఒక ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేస్తున్నారని అన్నారు. కుటుంబ వ్యవహారంతో సామాన్య ప్రజలకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారని వ్యాఖ్యానించారు. 2014-19 మధ్య కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేరని గుర్తు చేశారు.ఉద్యమం పేరుతో కేసీఆర్ కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారని ఆయన ఆరోపించారు. అది ఊరికే పోలేదని అన్నారు.హైదరాబాద్ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఎల్ అండ్ టీతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోందని అన్నారు. కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారని విమర్శించారు.కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కిషన్ రెడ్డి పదేపదే డిమాండ్ చేశారని, అలా చేస్తే 48 గంటల్లోనే ఈ కేసు విచారణ చేపట్టేలా చూస్తానని అన్నారని తెలిపారు. సీబీఐకి ఈ కేసును ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కిషన్ రెడ్డి ఎక్కడా మాట్లాడటం లేదని అన్నారు. సీబీఐ దర్యాప్తు ఆపాలని కేటీఆర్ కోరడంతో కిషన్ రెడ్డి దానిని అమలు చేశారని ఆరోపించారు. వారిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉందని అన్నారు.