![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 29, 2025, 05:08 PM
రైతుల సంక్షేమమే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఒక్కో పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవలే రైతు భరోసా పథకం నిధుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం రికార్డు వ్యవధిలో విజయవంతంగా పూర్తిచేసింది. మొత్తం 69.39 లక్షల మంది రైతులకు గాను రూ.8,744.13 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది రేవంత్ సర్కార్. ఇటీవల 15 ఎకరాలకు పైబడిన రైతులకు కూడా నిధులు విడుదల చేయడంతో రైతు భరోసా నగదు పంపిణీ పూర్తయింది. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం "ఇందిరమ్మ ఆత్మీయ భరోసా" పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు సాయం చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. అలాగే కౌలు రైతులకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జూన్ 29న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. "ఇందిరమ్మ ఆత్మీయ భరోసా" పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించనున్నారు. రాష్ట్రంలోని భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ. 12,000 ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో పొందుపరిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు "ఇందిరమ్మ ఆత్మీయ భరోసా" పథకం కింద రైతు కూలీలకు జులై తొలి వారంలో నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 రెండు విడతల్లో ఇస్తామని ఇదివరకే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కో విడతలో రూ.6,000 చొప్పున అకౌంట్లలో జమచేసేందుకు కసరత్తు ప్రారంభించింది. "ఇందిరమ్మ ఆత్మీయ భరోసా" పథకానికి అర్హత పొందాలంటే కొన్ని పరిమితులు విధించింది రాష్ట్ర ప్రభుత్వం. లబ్దిదారుడు తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి. భూమి లేని వ్యవసాయ కూలీ అయి ఉండాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజుల పాటు పని చేసినట్లు రికార్డు ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు మాత్రమే ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందగలరని అధికారులు స్పష్టం చేశారు.