|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:24 PM
తెలంగాణలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తే, ఏపీ ప్రాజెక్టులపై తాము కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని ఆయన స్పష్టం చేశారు."ఈరోజు అందుకే నేను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచన చేస్తున్నాను. కేంద్రంలో మీకు పలుకుబడి ఉండవచ్చు. మీరేం చెబితే మోదీ గారు అది వినవచ్చు. అలా అని ప్రాజెక్టులన్నింటికీ అనుమతి వస్తుందని అనుకుంటే అది భ్రమ. అలాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన మా వద్ద ఉంది. మేము వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నాం. అక్కడ మాకు న్యాయం జరగకుంటే న్యాయస్థానాలకు వెళతాం అక్కడి నుంచి ప్రజల వద్దకు వెళతాం" అని ఆయన అన్నారు.బుధవారం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.2019 అక్టోబరులోనే అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించే విషయంపై చర్చించారని రేవంత్ రెడ్డి అన్నారు. "గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు ఆనాడే ఒకరకంగా అంకురార్పణ జరిగింది. రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్ అన్నట్లు నాడు 'నమస్తే తెలంగాణ' పత్రికలో కథనాలు కూడా వచ్చాయి" అని ఆయన తెలిపారు. బనకచర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని, ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించారు.