|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 05:08 PM
తెలంగాణలో రేషన్‌కార్టుదారులకు ప్రభుత్వం.. సన్న బియ్యం పంపిణీ చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచే అనగా.. 2025 ఏప్రిల్ 1నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ ఉచిత సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రంలోని పేద కుటుంబాలలోని ఒక్కో వ్యక్తికి.. నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల.. రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడమేకాక.. వాటి ధర కూడా గణనీయంగా దిగి వచ్చేందుకు అవకావం ఉందని ప్రభుత్వం భావించింది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు.. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్నారు. దీని ప్రకారం చూసుకుంటే మనిషికి నెలకు ఆరు కిలోల చొప్పున.. మూడు నెలలకు కలిపి 18 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇస్తుండటం వల్ల ఎక్కువ పరిమాణంలో సన్న బియ్యం పంపిణీ అవుతున్నాయి. అయితే కొందరు వ్యక్తులు వారి రేషన్ కార్డు ద్వారా వచ్చిన సన్న బియాన్ని అమ్ముకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు కీలక సూచనలు చేశారు. ఎవరైనా సన్నబియ్యం అమ్ముకుంటే.. వారి రేషన్ కార్డు రద్దు చేస్తాం అని తెలిపారు. ఖమ్మం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం రేషన్‌కార్డుదారలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని బయటి వ్యక్తులకు, బహిరంగ మార్కెట్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని.. అలాంటి వారి రేషన్ కార్డు రద్దు చేస్తామని ఖమ్మం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. అలానే బయటి వ్యక్తులు ఎవరైనా సన్నబియ్యం కొంటే.. వారిపై కూడా క్రిమినిల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో చందన్ కుమార్.. మంగళవారం ఖమ్మం అర్బన్ మండలంలోని శ్రీనివాస్ నగర్, ప్రకాశ్ నగర్‌లో రేషన్ షాపులను డిప్యూటీ తహసీల్దార్ తో కలిసి పలు రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చందన్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఒకే సారి మూడు నెలల రేషన్ పంపిణీ ప్రక్రియ సజావుగా ముందుకు సాగుతుందని తెెలిపారు. ఖమ్మం జిల్లాకు 21,915 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం స్టాక్ వచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 4,15, 904 రేషన్ కార్డులకు గానూ.. 3,3 ,596 రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అంతేకాక జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 213 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని.. పట్టుకుని నిందితులపై కేసులు పెట్టినట్లు చందన్ కుమార్ తెలిపారు.