|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 03:49 PM
హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు అందింది. ఎయిర్ పోర్ట్ ను పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఇమెయిల్ చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. స్నిఫర్ డాగ్స్ ను రంగంలోకి దించారు. ఈ ఉదయం బేగంపేట్ విమానాశ్రయానికి ఈ ఈమెయిల్ అందింది. దీంతో భద్రతా సిబ్బంది, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ సహాయంతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈమెయిల్ అందిన నిమిషాల వ్యవధిలోనే విమానాశ్రయ అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ మరియు స్నిఫర్ డాగ్స్‌ను రంగంలోకి దించారు. తనిఖీలు నిర్వహించడానికి ముందు పోలీసులు సిబ్బందిని భద్రత అధికారులు వారి వారి గదులను ఖాళీ చేయాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా ఓ అగ్నిమాపక వాహనాన్ని సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలో నిలిపి ఉంచారు. పోలీసులు ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. మరో వైపు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐడీ ఆధారంగా ఈ ఈమెయిల్ ఎక్కడి నుంచి పోస్ట్ అయిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నారు. దాని మూలాలను తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తరువాత బేగంపేట్ ఎయిర్ పోర్టులో వాణిజ్యపరమైన కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 2008, మార్చి 23వ తేదీన శంషాబాద్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత బెగంపేట విమానాశ్రయంలో కమర్షియల్ ఫ్లైట్స్ రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయం.. చార్టర్డ్ విమానాలు, సైనిక కార్యకలాపాల కోసం వినియోగిస్తోన్నారు. అలాగే- ప్రకృతి వైపరీత్యాల సమయంలో అత్యవసర పరిస్థితులకు సహాయక సామగ్రిని తరలించడానికి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ ను వినియోగిస్తోన్నారు. అలాగే- ఏవియేషన్ ట్రైనింగ్ కోసం ఇది అందుబాటులో ఉంటోంది.