|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 06:52 PM
తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుంది. అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. మరి ఇంతకు ఈ ఉపఎన్నిక ఎప్పుడు నిర్వహించనున్నారు.. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది అనే వివరాలు..
అక్టోబర్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌లో షెడ్యూల్ విడుదల చేస్తారని సమాచారం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఇక దీనికి సంబంధించి.. ఏర్పాట్లు చేయాల్సిందిగా.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించే ఎన్నికలు కావడంతో.. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం వీటి నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం.. జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేయడంతో.. బల్డియా ఉప ఎన్నిక పనులను వేగవంతం చేసింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 3,89,954 ఓటర్లు ఉన్నారు. అయితే ఉప ఎన్నిక నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాక త్వరలోనే ఈ నియోజకవర్గం పరిధిలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి నామినేషన్ల చివరి రోజు వరకు కొత్త ఓటర్లను నమోదు చేయనున్నారని తెలుస్తోంది.
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఈవీఎంలు, వాటి భద్రత వంటి అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 500 ఈవీఎంలు అవసరం ఉంది. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ 1000 వరకు ఈవీఎంలను సిద్ధం చేసింది. ఇక భద్రత కోసం రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను వినియోగించుకోనున్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు 1500 మంది సిబ్బంది అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు. దీనిపై కూడా జీహెచ్ఎంసీ కార్యచరణ సిద్ధం చేసి పెట్టుకుంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా.. అందుకు తాము సిద్దంగా ఉన్నామని జీహెచ్ఎంసీ ఎన్నికల సంఘానికి తెలిపింది.