|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 03:54 PM
పటాన్చెరు : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ అందించడంలో భాగంగా నూతన సబ్ స్టేషన్ లతోపాటు.. 11 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్ పరిధిలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం తో మొదలు డివిజన్ వరకు విద్యుత్ శాఖ అధికారులతో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి.. విద్యుత్ స్తంభాల పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించడం జరిగిందని తెలిపారు.ప్రధానంగా ఇనుప స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలతో పాటు తుప్పు పట్టిన స్తంభాలా స్థానంలో నూతన స్తంభాలు, వదులుగా ఉన్న వైర్ల స్థానంలో నూతన వైర్లు ఏర్పాటు చేసేందుకు పటాన్చెరు డివిజన్ పరిధిలో రెండు కోట్లు, ఇస్నాపూర్, కొల్లూరు సబ్ డివిజన్ పరిధిలో తొమ్మిది కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో చర్చించి నిధులు మంజూరు చేయించడం జరుగుతుందని తెలిపారు. గత వేసవిలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించి ప్రజల మన్ననలు పొందడం జరిగిందని తెలిపారు. వర్షాకాలంలోనూ ఇదేవిధంగా పనిచేయాలని సూచించారు.
త్వరలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీ, బీరంగూడ గోశాల, రామచంద్రపురం మండల పరిషత్ ఆవరణలో 15 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 కెవి సబ్స్టేషన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సింఫనీ కాలనీ, పోచారం గ్రామ పరిధిలో నూతన సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని.. త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. నూతన కాలనీలకు సైతం విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండడంతో పాటు.. ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పటాన్చెరు డిఈ భాస్కర్, ఏడీఈలు తులసి రామ్, సంజీవ్, దుర్గాప్రసాద్, నాగరాజు, మాధవరావు, ఏఈలు పాల్గొన్నారు.