|
|
by Suryaa Desk | Sat, Jun 14, 2025, 08:46 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'గద్దర్' ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురష్కారాలు అందజేయనున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో జరుగుతున్న అవార్డుల కార్యక్రమం కావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ, శ్రీముఖి వ్యాఖ్యలుగా వ్యవహరిస్తున్నారు.
ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. ''ఇవాళ హైదరాబాద్ లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అంగరంగ వైభవంగా జరుపుకోడానికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు. 14 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి అవార్డులు ఇచ్చుకుంటున్నాం. 2024లో వివిధ కేటగిరీలలో ఎంపిక చేయబడిన అన్ని చిత్రాలకు అవార్డులు ప్రధానం చేయనున్నాం.''
''అలానే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు నుంచి 2023 వరకూ ప్రతీ ఏడాది మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి పురష్కారాలు అందజేస్తున్నాం. నేషనల్ అవార్డులు వచ్చిన సినిమాలు, రివ్యూలు వచ్చిన చిత్రాలు, కమర్షియల్ గా బాగా ఆడిన సినిమాలను పరిగణలోకి తీసుకొని జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్ ఆధ్వర్యంలో పదేళ్ల కాలానికి ప్రతీ ఏడాది మూడు సినిమాల చొప్పున సెలెక్ట్ చేసారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. ఇలా ప్రతీ సినిమాకి నాలుగు కేటగిరీలలో అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.''
''జ్యూరీ చైర్మన్ జయసుధ ఆధ్వర్యంలో 2024లో వచ్చిన ఎన్నో చిన్న సినిమాలు, కళాత్మక చిత్రాలను జ్యూరీ ఎంపిక చేసింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేయడం ఎంతో ఆనందదాయకం. నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, యండమూరి వీరేంద్రనాథ్ కు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డ్, సుకుమార్ కి బీఎన్ రెడ్డి అవార్డ్ అందజేయనున్నాం'' అని అన్నారు.