|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 07:54 PM
తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనం, ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన 'శివ' విడుదలై 36 సంవత్సరాలు పూర్తయింది. నాగార్జున కెరీర్‌ను శిఖరాగ్రానికి చేర్చిన ఈ చిత్రం, దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు చెరిగిపోని కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం రీ-రిలీజ్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, ఆ సంచలన చిత్రాన్ని సృష్టించిన రామ్ గోపాల్ వర్మ, ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్ర కథానాయకుడు 'శివ' పాత్రను తాను ఇప్పుడు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నానని చెప్పడం ఆసక్తి రేపుతోంది. తాను 26 ఏళ్ల వయసులో కేవలం ఊహతో సృష్టించిన శివ పాత్ర, 62 ఏళ్ల వయసులో పరిణతితో చూసినప్పుడు కొత్తగా అర్థమైందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. రీ-రిలీజ్ కోసం సినిమాను మళ్లీ చూస్తున్నప్పుడు ఈ కొత్త అవగాహన కలిగిందని ఆయన తెలిపారు. "శివ అపారమైన ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి. అతని ధైర్యానికి మూలం తను నమ్మిన సిద్ధాంతాలే. బెదిరింపులకు, దౌర్జన్యాలకు తలొంచడం కన్నా చావడమే మేలని భావించే తత్వం అతనిది. అతనికి గౌరవం అనేది ఒక సుగుణం కాదు, అది మనిషి అస్తిత్వానికే చిహ్నం" అని వర్మ వివరించారు. శివ పాత్ర సంప్రదాయ హీరోల్లా భావోద్వేగాలను ప్రదర్శించదని, పెద్దగా అరవడని, అతని శక్తి నిశబ్దంలోనే ఉంటుందని తెలిపారు. "అతను కీర్తి కోసమో, ప్రతీకారం కోసమో పోరాడడు. అణచివేతను సహించలేక మాత్రమే ఎదురు తిరుగుతాడు. అతని తిరుగుబాటు పైకి కనిపించదు, అది అంతర్గతమైనది. అతని ప్రశాంతమైన రూపానికి, లోపలున్న సిద్ధాంతాల తుఫానుకు మధ్య జరిగే నిరంతర సంఘర్షణే శివ" అని వర్మ పేర్కొన్నారు. రాజకీయాలు, గ్యాంగ్‌లు, అధికారంపై శివకు ఆసక్తి లేకపోయినా, భయపెట్టలేని వాడిని చూసి అధికారమే అతని వైపు ఆకర్షితురాలవుతుందని వ్యాఖ్యానించారు.
Latest News