|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 07:54 PM
హిందీ నుంచి మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఆ సిరీస్ పేరే, 'సెర్చ్: ది నైనా మర్డర్ కేస్'. టైటిల్ తోనే అందరిలో ఉత్కంఠను రేకెత్తించిన సిరీస్ ఇది. 6 ఎపిసోడ్స్ తో కూడిన ఈ సిరీస్, ఈ రోజు నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. కొంకణా సేన్ శర్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి, రోషన్ సిప్పి దర్శకత్వం వహించాడు. కథ: ముంబై క్రైమ్ బ్రాంచ్ లో ఏసీపీ సంయుక్త దాస్ ( కొంకణా సేన్ శర్మ) పనిచేస్తూ ఉంటుంది. తన భర్త భీషణ్ .. టీనేజ్ వయసులో ఉన్న కూతురు 'మహీ' కోసం ఎక్కువ సమయం గడపడలేకపోవడం వలన, వాళ్ల వైపు నుంచి అసంతృప్తి ఉంటుంది. దాంతో 'అహ్మదాబాద్' లో కొత్త ఇంటిని తీసుకున్న ఆమె అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఆమె స్థానంలోకి ఏసీపీ జై కన్వర్ (సూర్య శర్మ) కూడా వచ్చేస్తాడు. ఆమె రిలీవ్ అవుతున్న సమయంలోనే ఒక మర్డర్ కేసు వస్తుంది. ముంబైలోని ఒక కాలేజ్ లో చదువుతున్న 'నైనా' అనే అమ్మాయి హత్య చేయబడుతుంది. ఆ ప్రాంతానికి జై కన్వర్ కొత్త కావడం వలన, ఈ కేసు కోసం మరో రెండు రోజులు కేటాయించమని పై అధికారి సంయుక్తను కోరతాడు. ఆమెకి తోడుగా ఉండమని జై కన్వర్ ని ఆదేశిస్తాడు. దాంతో ఆమె రంగంలోకి దిగుతుంది. హంతకులు నైనాను హత్య చేసి .. ఓ కారులో ఆమె డెడ్ బాడీని ఉంచి, వర్షపు నీటితో నిండిన ఒక క్వారీలోకి తోసేస్తారు. ఆ బాడీని కనుక్కుని సంయుక్త బయటికి తీయిస్తుంది. డెడ్ బాడీ దొరికిన కారు, రాజకీయాలలో ఎదగాలనుకుంటున్న తుషార్ (శివ్ పండిట్)కి సంబంధించినది. ఎలక్షన్స్ పనులపై తిరగటానికి ఆయన తెప్పించిన కార్లలో అది ఒకటి. అందువలన సంయుక్త ఆయనను అనుమానిస్తుంది. ఇక కాలేజ్ లో లవ్ అంటూ నైనా వెంటపడి వేధించిన స్టూడెంట్ 'ఓజస్' ను కూడా ఆమె సందేహిస్తుంది. అలాగే నైనాతో ఎక్కువగా ఛాటింగ్ చేసిన ప్రొఫెసర్ 'రణధీర్' పై కూడా ఓ కన్నేస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో ఆమెకి తెలిసే నిజాలు ఏమిటి? అసలు హంతకులు ఎవరు? అనేది మిగతా కథ.
Latest News