|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 08:44 PM
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయంగా అన్ని పార్టీల మధ్య తీవ్ర కాక రేపుతోంది. అయితే ఈ బైపోల్స్‌లో సిట్టింగ్ సీటు అయిన బీఆర్ఎస్‌కు, అధికార కాంగ్రెస్ పార్టీకి హోరాహోరీ పోరు జరగనుందనే వార్తలు వస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు బీజేపీ.. పోటీ ఇచ్చే పరిస్థితి లేదనే వాదనలు వస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి (శుక్రవారం) తెలంగాణ కేబినెట్ విస్తరించాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
అయితే టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వనున్నారనే వార్త ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ బైపోల్స్ టికెట్ ఆశించిన అజారుద్దీన్‌కు.. హైకమాండ్ మొండిచేయి చూపించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. మంత్రి పదవి కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం రోజున అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు హస్తం పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇక నిన్ననే అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీ్న్.. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అజారుద్దీన్ సిద్ధంగా ఉండాలని.. అసదుద్దీన్‌కు సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్‌లో ముస్లిం మంత్రి లేకపోవడం తీవ్ర విమర్శలకు కారణం అవుతుండగా.. ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇక నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుండగా.. ఇలాంటి కీలక తరుణంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టనున్నారనే వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు కీలకం కానున్న నేపథ్యంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వనున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగనుండగా.. 14వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన సతీమణి మాగంటి సునీత బరిలో నిలవగా.. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు.