|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 07:04 PM
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (సెప్టెంబర్ 23) సమావేశమైన మంత్రివర్గం.. ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ను తొలగించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్, పురపాలక చట్టాల సవరణ చేయనున్నట్లు సమాచారం. దీంతోపాటు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పునరుద్ధరణపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని సవరించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దీంతో ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో చేసిన చట్ట సవరణను.. తెలంగాణ పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలోనూ చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించారు. ఆ దస్త్రంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో సమర్పించడంతో.. చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.